నిన్నే సోషల్ మీడియాలోకి ఎంట్రీ .. ట్విట్టర్ పిట్టకు పనిచెప్పిన కేసీఆర్

 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత , మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ర చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తన పంధాను పూర్తిగా మార్చేశారు. జనం మద్ధతును తిరిగి పొందేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధుల విజయం కోసం బస్సు యాత్ర చేయడంతో పాటు దాదాపు పుష్కర కాలం తర్వాత తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కేసీఆర్. అయితే వీటితో పాటు ప్రస్తుతం శక్తివంతమైన మాధ్యమంగా వున్న సోషల్ మీడియా పవర్‌ను ఆయన గుర్తించారు. 

తన భావజాలాన్ని , ఇతరత్రా సంగతులను పంచుకోవడానికి.. ముఖ్యంగా యువతరానికి దగ్గర కావాలంటే సోషల్ మీడియానే సరైన సాధనంగా కేసీఆర్ గుర్తించారు. దీనిలో భాగంగా ఎన్నడూ లేనిది.. సామాజిక మాధ్యమాల్లోకి గులాబీ దళపతి అడుగుపెట్టారు. ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తెరిచారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజున సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. 

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు , రాష్ట్ర ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తొలి ట్వీట్ చేశారు. అలాగే తెలంగాణలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయంటూ మరో ట్వీట్‌లో కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు కేసీఆర్. 

‘‘ తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు ’’.

‘‘ నాతోపాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి. జై తెలంగాణ ’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు కేసీఆర్. 


Comments